మేడారం సక్సెస్‌కు నాలుగు పరీక్షలు
ట్రాఫిక్–పార్కింగ్‌పై పూర్తి పట్టు
జంపన్న వాగు వద్ద గట్టి భద్రత
రద్దీకి తగ్గట్టు క్యూ లైన్ల నియంత్రణ
పారిశుద్ధ్యమే అసలైన సవాల్
కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర 2026 ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ మహా వేడుకను విజయవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం 200 కోట్లకు పైగా నిధులు వెచ్చించి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జాతరకు ముందే గద్దెల పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభించడంతో ఈసారి భక్తుల రాక మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త గద్దెలు, ఆధునిక వసతుల నేపథ్యంలో సుమారు మూడు కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ భారీ రద్దీ మధ్య జాతర సాఫీగా సాగాలంటే నాలుగు కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి అవసరమని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి జాతరకు ప్రభుత్వం ప్రత్యేక బస్సులు నడిపినా, ఎక్కువ మంది భక్తులు తమ స్వంత వాహనాల్లోనే మేడారానికి చేరుకుంటారు. కొందరు నాలుగు రోజుల పాటు అక్కడే బస చేస్తారు. దీంతో జాతర రోజుల్లో మేడారం వైపు ప్రధాన రహదారులు ఎప్పటికప్పుడు వాహనాల రద్దీతో నిండిపోతాయి. చిన్న సమస్య వచ్చినా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి భక్తులు గంటల తరబడి రోడ్డుపైనే చిక్కుకునే పరిస్థితి గతంలో ఎదురైంది. ఈసారి అలా జరగకుండా వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షిస్తూ, పార్కింగ్ ప్రదేశాలను సక్రమంగా వినియోగిస్తూ ట్రాఫిక్‌ను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.

జంపన్న వాగు వద్ద అప్రమత్తత తప్పనిసరి
మేడారానికి వచ్చే భక్తులు ముందుగా జంపన్న వాగులో స్నానం చేసి అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీ. దీంతో జాతర రోజుల్లో జంపన్న వాగు ప్రాంతం అత్యంత రద్దీగా మారుతుంది. ఈ సమయంలో ఆభరణాల చోరీలు, చిన్నపిల్లలు తప్పిపోవడం, ఈత రాని వారు నీటిలో దిగడం వంటి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. గతంలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలూ నమోదయ్యాయి. అందుకే జంపన్న వాగు వద్ద నీటి ప్రవాహాన్ని నిరంతరం గమనిస్తూ, రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచి, పోలీసుల గట్టి నిఘా కొనసాగిస్తేనే ప్రమాదాలను అరికట్టవచ్చని స్థానికులు సూచిస్తున్నారు.

క్యూలైన్లు–దర్శనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
మహా జాతర రోజుల్లో భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తుంది. ఈ క్యూలైన్లలో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఉండటంతో అస్వస్థతకు గురయ్యే పరిస్థితులు తలెత్తుతుంటాయి. రద్దీ పెరిగితే నెట్టిపారేయడం, తొక్కిసలాటకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. అందుకే అధికారులు క్యూలైన్లపై నిరంతరం పర్యవేక్షణ చేయాలి. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి త్వరిత దర్శనం కల్పిస్తే భక్తులకు ఊరట లభిస్తుంది. అలాగే గద్దెల ప్రాంగణంలో తప్పిపోయిన వారిని వెంటనే గుర్తించి కుటుంబ సభ్యులతో కలిపే ప్రత్యేక బృందాలు పనిచేయాల్సిన అవసరం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

పారిశుద్ధ్య నిర్వహణే అసలైన పరీక్ష
నాలుగు రోజుల్లోనే మూడు కోట్ల మంది భక్తులు తరలివచ్చే మేడారం జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత కీలకం. చెత్త తొలగింపు సక్రమంగా జరగకపోతే పరిసరాలు అపరిశుభ్రంగా మారి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. జాతర జరుగుతున్న సమయంలోనే కాకుండా అనంతరం కూడా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం, క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం వంటి చర్యలు తీసుకుంటే భక్తులు అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ట్రాఫిక్ నియంత్రణ, జంపన్న వాగుపై నిఘా, క్యూలైన్ల సమర్థ నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ—ఈ నాలుగు అంశాల్లో ఏ ఒక్కటిలో లోటుపాట్లు ఉన్నా మేడారం మహా జాతరపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని జిల్లా వాసులు అంటున్నారు. 200 కోట్లకు పైగా వ్యయంతో నిర్వహిస్తున్న ఈ మహా జాతర విజయవంతం కావాలంటే ఈ నాలుగు అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందేనని మేధావులు, స్థానికులు సూచిస్తున్నారు.



