- రూ. 30 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు
- డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుభుధి
కాకతీయ, వరంగల్ బ్యూరో : జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఎన్‌ఐటీ) వరంగల్‌లో శుక్రవారం రెండు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుభుధి శుక్రవారం ఓపెన్ ఎయిర్ అంపైథియేటర్, కొత్త క్యాంటీన్ నిర్మాణాలకు శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 24.40 కోట్ల అంచనా వ్యయంతో సీపీడబ్ల్యూడీ ద్వారా నిర్మించబడనున్న ఓపెన్ ఎయిర్ అంపైథియేటర్ 18 నెలల్లో పూర్తి కానుందని తెలిపారు. 2,500 మంది కూర్చునే సామర్థ్యంతో పాటు రెండు ఆర్ట్ గ్యాలరీలు, ఒక మల్టీ పర్పస్ హాల్ కూడా ఇందులో భాగంగా ఉంటాయన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా సమావేశాలు, ప్రజా చర్చలు జరపడానికి ఇది ఆధునిక వేదికగా మారనుందన్నారు. విద్యార్థుల సృజనాత్మకత, కళాత్మకత, పరస్పర మేళవింపును పొందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అదేవిధంగా రూ. 6.11 కోట్ల అంచనా వ్యయంతో 350 సీట్ల డైనింగ్ హాల్ తదితర సదుపాయాలతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పి. రతీష్ కుమార్, రిజిస్ట్రార్, విభాగాధిపతులు, తదితర అధికారులు పాల్గొన్నారు.


