మున్సిపల్ ఎన్నికల బరిలో ఫార్వర్డ్ బ్లాక్
సింహం గుర్తుతో అన్ని చోట్ల పోటీ బండారి శేఖర్
కాకతీయ, కరీంనగర్ : భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మంచిర్యాల చౌరస్తా నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి విగ్రహానికి పూలమాలలు వేశారు.
ఈ సందర్భంగా బండారి శేఖర్ మాట్లాడుతూ, నేతాజీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. నేతాజీ స్ఫూర్తితో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల సింహం గుర్తుతో పోటీ చేస్తామని తెలిపారు. అవకాశవాద రాజకీయ పార్టీలను ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, 10 మున్సిపాలిటీల్లో సింహం గుర్తుతో గెలిచి జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేతాజీ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలను పట్టణాల్లో ప్రతి ఇంటికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ నగర అధ్యక్షుడు సత్యారావు, జిల్లా కమిటీ సభ్యులు కురువెల్లి శంకర్, బొంకురి సురేందర్, ప్రశాంత్ కుమార్, స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతికం రాజశేఖర్ గౌడ్, యూత్ లీగ్ నాయకుడు సాయి తదితరులు, సుమారు 50 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.


