కాకతీయ, మంథని : బతికినన్నీ రోజులు మంథని నియోజకవర్గ ప్రజలతో తాము ఉంటామని, శ్రీధర్ బాబు చంపినా ఫర్వాలేదని మంథని మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ పుట్ట శైలజ అన్నారు. శ్రీధర్‌బాబు తమ ఇంటిపై కార్యకర్తలతో దాడులు చేయించారని ఆరోపించారు. కమాన్‌పూర్‌లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడం శ్రీధర్‌బాబుకు నచ్చలేదని, అందుకే తమ ఇంటిపై దాడికి ఉసిగొల్పాడని ఆరోపించారు.
మంథని నియోజకవర్గంలో శ్రీపాదరావు విగ్రహాలు తప్పా మరొకరివి ఉండకూడదా..? అంటూ శైలజ ప్రశ్నించారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఇంటిపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా మంథని నియోజకవర్గ కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
ఏసీపీ, సీఐలు దగ్గరుండి మరీ దాడి చేయించారని, అంబేద్కర్ విగ్రహం అవిష్కరించి 24గంటలు గడువకముందే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఇంటిపై దాడికి దిగడం ఎంత అరాచకమో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. తాము బతికినా చచ్చినా ఇక్కడే ఉంటామని, శ్రీధర్ బాబు చంపినా ఇక్కడే చచ్చిపోతామని, మంథని ప్రజలకు సేవ చేయడం కోసమే నిరంతరం భార్యా భర్తలం కృషి చేస్తామన్నారు.


