మాజీ మంత్రి హరీష్‌రావుకు పితృవియోగం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు కొద్ది సేపటి క్రితం మృతి చెందారు. వయోభారం, అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సత్యనారాయణ రావు కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మరణంతో తన్నీరు కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు ఆలుముకున్నాయి. హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. హరీష్‌రావుకు పితృవియోగంపై పలువురు బీఆర్‌ఎస్ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. రాజకీయాల్లో హరీష్ రావు విజయానికి, వ్యక్తిత్వానికి తండ్రి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం ఎంతో ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. సత్యనారాయణ మరణ వార్త వినగానే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, హరీష్ రావు కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆయన ఇంటికి తరలివెళ్లారు. సత్యనారాయణ భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు, నేతలు, ప్రజాప్రతినిధులు హరీష్ రావు నివాసానికి చేరుకుంటున్నారు.
కేసీఆర్ సంతాపం.!
తన బావ (కేసీఆర్ 7 వ సోదరి, అక్క లక్ష్మీ భర్త ), మాజీ మంత్రి పార్టీ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు తండ్రి, తన్నీరు సత్యనారాయణ మరణంపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, వారి మృతిపై విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సమాచారం తెలిసిన వెంటనే హరీష్ రావు కు ఫోన్ చేసి పరామర్శించిన కేసీఆర్, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరికాసేపట్లో వారి నివాసానికి వెళ్లి, సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు.



