కాకతీయ, రాయపర్తి: పంటల అదునుకు యూరియా అందక నెల రోజుల నుండి తిండి తిప్పలు మాని యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తూ బేజారవుతున్నారని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. యూరియా అందించాలని మండల కేంద్రంలోని వరంగల్- ఖమ్మం జాతీయ రహదారి(563)పై శుక్రవారం రైతు సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.
మండలంలోని 40 గ్రామాల నుండి వేల సంఖ్యలో రైతులు హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాకు మద్దతు తెలిపి రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ధర్నాలో ఎర్రబెల్లి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులపై మొండి వైఖరి తగదని మండిపడ్డారు. రైతులకు సరైన సమయంలో యూరియా అందించకుండా అన్నదాతలను అరిగోస పెడుతున్నారని వాపోయారు.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆరు నెలల ముందే యూరియా దిగుమతి చేసి, నిల్వ ఉంచి సకాలంలో రైతులకు అందించామని అన్నారు. తక్షణమే యూరియా అందించి రైతులను ఆదుకోవాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. సుమారు గంటపాటు జాతీయ రహదారిపై వాహనాలు స్తంభించిపోయాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నాను విరమింప చేసే ప్రయత్నం చేశారు.
ఎర్రబెల్లిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరగడంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అయినప్పటికీ ఎస్సై ముత్యం రాజేందర్, వర్ధన్నపేట ఎస్సై రాజు సిబ్బందితో కలిసి తమ వాహనంలో ఎర్రబెల్లిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.


