ఏసీబీ వలలో అటవీ రేంజర్
రూ.3.50 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్
కొత్తగూడెం అటవీ విభాగంలో కలకలం
అనుమతులు, ఫైళ్ల క్లియరెన్స్ పేరుతో డిమాండ్
నివాసం, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) పరిధిలో పనిచేస్తున్న ఓ రేంజర్ స్థాయి అధికారి ఏసీబీ వలలో చిక్కారు. కొత్తగూడెం అటవీ విభాగానికి చెందిన ఈ అధికారి ఓ వ్యక్తి నుంచి రూ.3.50 లక్షల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటనతో అటవీ శాఖలో తీవ్ర కలకలం రేగింది. అటవీ అనుమతులు, పనుల మంజూరు, ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా ముందస్తు ప్రణాళిక రూపొందించిన ఏసీబీ అధికారులు వల పన్ని, నగదు స్వీకరిస్తున్న క్షణంలో దాడి చేసి అధికారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇళ్లూ, కార్యాలయాల్లో తనిఖీలు
పట్టుబడ్డ అధికారి నివాసంతో పాటు కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లంచం నగదును స్వాధీనం చేసుకుని, సంబంధిత ఫైళ్లు, రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరెవరైనా పాల్పడ్డారా అన్న కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడికానున్నాయి.


