కాకతీయ, క్రైమ్ డెస్క్: పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు ఓ మహిళను దారుణంగా చంపి..7 ముక్కలు చేసి బావిలో పడేసిన ఘటన యూపీలో జరిగింది. రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లా కిశోర్ పురా గ్రామంలోని బావిలో ఇటీవల ఓ మహిళ శరీర భాగాలు ఉన్న రెండు బస్తాలు తేలడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శరీర భాగాలను స్వాధీనం చేసుకుని అనంతరం పోస్ట్ మార్టంకు తరలించారు. అయితే మ్రుతురాలి తల, కాళ్లు లభ్యం కాకపోవడంతో ఎవరనే విషయం గుర్తించడం కష్టంగా మారింది. ఈ కేసును సవాలుగా తీసుకుని కేసును చేధించేందుకు 8 బ్రుందాలను ఏర్పాటు చేశారు.
తర్వాత పోలీసులు అంటించిన పోస్టర్ల ఆధారంగా మ్రుతురాలి సోదరుడు వారిని ఆశ్రయించడంతో ఆమె తికమ్ గఢ్ గ్రామానికి చెందిన రచనా యాదవ్ గా గుర్తించారు. రచనా యాదవ్ భర్త కొంత కాల క్రితం మరణించాడు. గ్రామ మాజీప్రధాన్ సంజయ్ పటేల్ తో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. తనను పెళ్లి చేసుకోవాలని రచన ఒత్తిడి చేయడంతో ఆమెను హత్య చేయాలని సంజయ్ పటేల్ పథకం వేశాడు. మేనల్లుడు, స్నేహితుడి సహాయంతో నిందితుడు రచన గొంతు కోసి, హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా డెడ్ బాడీని ఏడు ముక్కలుగా నరికి బస్తాల్లో కుక్కి బావిలో పడేసినట్లు తెలిపారు. తల, కాళ్ల భాగాలను సమీపంలోని లేఖరీ నదిలో పడేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడితోపాటు అతని మేనల్లుడిని అరెస్ట్ చేసిన పోలీసులు వారికి సహకరించిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు.


