మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలి
ఒత్తిడిని జయిస్తేనే ఆరోగ్యకర జీవితం
వైద్యులు డాక్టర్ మీరాజ్, డాక్టర్ కే. మానస
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం
కాకతీయ, తొర్రూరు : ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మీరాజ్, డాక్టర్ కే. మానస తెలిపారు. సోమవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ… మానసిక ఆరోగ్యం దెబ్బతింటే శారీరక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలమని స్పష్టం చేశారు. నేటి యువత ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, అందుకే ఖాళీగా ఉండకుండా నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నంగా ఉండాలని సూచించారు. ఒత్తిడిని తగ్గించుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, రోజుకు కనీసం ఆరు గంటల పాటు నిద్ర తప్పనిసరిగా అవసరమని తెలిపారు. పౌష్టికమైన, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా మానసిక స్థితి మెరుగుపడుతుందన్నారు. మానసిక ఒత్తిడితో కుంగిపోయే వారిని కుటుంబ సభ్యులు, స్నేహితులు గుర్తించి, అవసరాన్ని బట్టి వెంటనే వైద్య నిపుణుల వద్దకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శాంతి కుమార్ మాట్లాడుతూ… విద్యార్థులు చదువుతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా చూసుకోవాలని అన్నారు. అధ్యాపకులు సుజాత, పార్వతి, వాల్య నాయక్, అంజు ఆరా, సునీల్ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వైద్యుల సూచనలను ఆసక్తిగా విన్నారు.


