ఎఫ్‌ఎల్‌ఎస్ మోడల్ పరీక్షలు తప్పనిసరి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : ప్రాథమిక పాఠశాల విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ (ఎఫ్‌ఎల్‌ఎస్)లో భాగంగా తరచూ మోడల్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు ప్రాథమిక పాఠశాల, గోపాలపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలను ఆమె సందర్శించారు. 3వ తరగతి విద్యార్థులతో గణితం, ఆంగ్ల పాఠాలు చదివించి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. నోట్‌బుక్స్ తనిఖీ చేసి రాత నైపుణ్యంపై ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. ఎఫ్‌ఎల్‌ఎస్ పరీక్షలు జిల్లాలో యాదృచ్ఛికంగా నిర్వహిస్తామని, అందువల్ల ప్రతి విద్యార్థిని సన్నద్ధం చేయాలని తెలిపారు. మండల విద్యాధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహించాలని, కఠినమైన పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విద్యా సంవత్సరం ముగింపు దశలో ఉన్నందున ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఎంఈవో వాసవి పాల్గొన్నారు.


