కామారెడ్డిలో వరదలు.. కొట్టుకుపోతున్న జనం
కాకతీయ, నిజామాబాద్ : మెదక్ జిల్లాలోని ధూప్‌సింగ్ తండా వరదలో మునిగిపోయింది. తమను కాపాడాలని గ్రామస్తుల ఆర్తనాదాలు చేస్తున్నారు. గ్రామస్తులను కాపాడేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని ధూప్‌సింగ్ తండా యువకులు కాపాడారు. రామాయంపేట ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజీ హాస్టల్ వరద గుప్పిట్లో చిక్కుకుంది. . కామారెడ్డిలోని అనేక లోతట్టు కాలనీలు, ప్రాంతాలు నీట మునిగిపోయాయి. కార్లు, ఆటోలు వరదల్లో కొట్టుకుపోయాయి. తమను రక్షించాలంటూ జనం ఆర్తనాదాలు చేస్తున్నారు. రాజంపేట మండలం ఆరుగొండలో 41 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. కామారెడ్డి టౌన్‌లో 21 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. రేపు స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు. దోమకొండ మండలం సంగమేశ్వర్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదల్లో ఒక కారు చిక్కుకోవడంతో ఇద్దరు గల్లంతయ్యారు. ఇదిలా ఉండగా
కామారెడ్డి జిల్లాకు మరోసారి భారీ వర్ష సూచన ఉందని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షం బీభత్సంతో అనేక చోట్ల కల్వర్టులు తెగిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేసింది. ఇళ్లలోకి నీరు చేరి, నిత్యవసరాలు తడిసి ముద్దయ్యాయి. లో లెవల‌్ వంతెనలపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
కడెం ప్రాజెక్టుకు భారీగా వరద..!
నిర్మల్ జిల్లాలో కడెం జలాశయం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. కడెం జలాశయం దిగువ ప్రాంత ప్రజలకు అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కడెం పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


