మహబూబాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్ జాబ్ మేళా
20న జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో నిర్వహణ
కాకతీయ, మహబూబాబాద్ : ఫ్లిప్‌కార్ట్ సంస్థలో డెలివరీ బాయ్స్/గర్ల్స్‌గా మహబూబాబాద్ జిల్లా పరిధిలో పని చేయడానికి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు డిసెంబర్ 20, 2025న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి. రజిత ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాలు పైబడినవారు, పదో తరగతి లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. పండుగ సీజన్లు, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు డిమాండ్ పెరగడంతో డెలివరీ సేవలకు అధిక అవసరం ఏర్పడిన కారణంగా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అభ్యర్థులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, బైక్, స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 20, 2025న మహబూబాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, కురవి రోడ్‌లోని జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయం (రూమ్ నెం. 25, రెండవ అంతస్తు)లో నిర్వహించే జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు. విద్యార్హత సర్టిఫికేట్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలతో రావాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫ్లిప్‌కార్ట్ టీం లీడర్స్ రాజు (ఫోన్ నెం: 9121268407), సురేష్ (ఫోన్ నెం: 9908073593)లను సంప్రదించవచ్చని తెలిపారు.


