కాకతీయ, బిజినెస్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని మరోసారి వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇటీవల ముగిసిన “బిగ్ బిలియన్ డేస్ సేల్” తర్వాత, ఇప్పుడు సంస్థ “బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025” ను అధికారికంగా ప్రకటించింది. ఈ అద్భుత ఆఫర్ ఫెస్టివల్ అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.
స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లు, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్, బ్యూటీ, ఫర్నిచర్ వంటి అన్ని కేటగిరీల ఉత్పత్తులపై వినియోగదారులు భారీ తగ్గింపులను పొందనున్నారు. ఆపిల్, శాంసంగ్, సోనీ, వన్‌ప్లస్, షియోమీ, డెల్ వంటి ప్రముఖ బ్రాండ్లపై ప్రత్యేక డీల్స్‌ను అందించనున్నట్లు సంస్థ పేర్కొంది.
ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్స్ కోసం ప్రత్యేక అవకాశం కూడా ఉంది. వీరికి సేల్‌ను ఒక రోజు ముందుగానే .. అంటే అక్టోబర్ 10 నుంచే యాక్సెస్ చేసే అవకాశం లభిస్తుంది. ఇది ప్రీమియం సభ్యులకు ముందస్తు ఆఫర్లను అందించే ప్రత్యేక సౌకర్యం.
బ్యాంక్ ఆఫర్ల పరంగా కూడా ఫ్లిప్‌కార్ట్ ఈసారి ఆకర్షణీయమైన ఆఫర్లను సిద్ధం చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తో భాగస్వామ్యం ద్వారా క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోళ్లు చేసే వారికి 10శాతం వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అదనంగా నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు కూడా లభించనున్నాయి.
అదే సమయంలో, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ప్రత్యేక రివార్డులు, అదనపు క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. అయితే, ఈ సేల్ ముగింపు తేదీని ఫ్లిప్‌కార్ట్ ఇంకా ప్రకటించలేదు. వినియోగదారులు తమ కార్ట్‌లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, దీపావళి సీజన్‌లో లభించే ఈ మెగా ఆఫర్లను మిస్ అవకుండా ఉండాలని సూచిస్తోంది.


