అసిఫ్ నగర్‌లో ఫ్లాగ్ మార్చ్
ఎన్నికల నేపథ్యంలో భద్రతా సిద్ధత ప్రదర్శన
కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కరీంనగర్ పోలీసు శాఖ శాంతిభద్రతలపై పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తోంది. మూడు విడతల్లో జరగనున్న పోలింగ్‌లో తొలి విడతలో చొప్పదండి, రామడుగు, గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పరిస్థితులను పరిశీలించేందుకు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.ఎన్నికల ప్రచారం ఊపు అందుకున్న ఈ సమయంలో, కొత్తపల్లి మండలంలోని అసిఫ్ నగర్‌లో పోలీసులు భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతియుత ఎన్నికల వాతావరణం కొనసాగించడమే లక్ష్యంగా పోలీసు బలగాలు స్థానిక వీధుల్లో శక్తి ప్రదర్శన చేస్తూ ప్రజల్లో నమ్మకం కల్పించారు.ఫ్లాగ్ మార్చ్ అనంతరం ప్రజలతో మాట్లాడిన అధికారులు, రాబోయే ఎన్నికల్లో ఎటువంటి ఒత్తిడులకు, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎటువంటి మినహాయింపులు లేకుండా చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ వరకు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయకుమార్, కొత్తపల్లి ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, ఎస్సైలు సాంబమూర్తి, సంజీవ్, క్యూఆర్టీ సిబ్బంది, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.


