చెరువులో మోటార్లు తొలగించాలని మత్స్యకారుల విజ్ఞప్తి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా రాగంపేట రేవెల్లి గ్రామానికి చెందిన చెరువు పారకం ఆయకట్టు రైతులు, మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు కలసి చెరువులో ఉన్న మోటర్లను తొలగించాలంటూ కలెక్టర్‌కి వినతి పత్రం సమర్పించారు.వారి వివరాల ప్రకారం.దేశాయిపేట గ్రామానికి చెందిన కొందరు రైతులు చెరువులో సుమారు 30 మోటర్లు బిగించి పైపులైన్ల ద్వారా నీటిని వాడుకుంటున్నారని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే ఇరిగేషన్, విద్యుత్ శాఖలతో పాటు ఎంఆర్ఓ కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఎంఆర్ఓ, సీఐ, ఎస్‌ఐ, ఇరిగేషన్ ఎస్‌ఈ, ఈఈలు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్న అఖిలపక్ష సమావేశంలో కూడా ఇరిగేషన్ అధికారులు చెరువులో ఎట్టి పరిస్థితుల్లోనూ మోటర్లు పెట్టరాదని స్పష్టం చేశారని తెలిపారు.అయితే ఇప్పటికీ విద్యుత్ శాఖ వారు మోటర్లకు మంజూరును నిలిపివేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాగంపేట రేవెల్లి చెరువు మీద ఆధారపడి సుమారు 560 కుటుంబాలు చేపల వృత్తి ద్వారా జీవిస్తున్నాయని, చెరువు నీరు తగ్గిపోవడంతో చేపల పెంపకంపై తీవ్ర ప్రభావం పడుతోందని చెప్పారు.చేప పిల్లలను కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన మత్స్యకారులు ప్రస్తుతం జీవనోపాధి కష్టాల్లో ఉన్నారని, చెరువులోని మోటర్లను తక్షణమే తొలగించి ఆయకట్టు రైతులు, మత్స్యకారులకు న్యాయం చేయాలని వారు కోరుకున్నారు.


