కాకతీయ, కరీంనగర్ బ్యూరో: దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణసంచా విక్రయ కేంద్రాల ఏర్పాటు కోసం వ్యాపారులు ఈనెల 24వ తేదీ లోగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. అర్హత కలిగిన వారికి మాత్రమే అనుమతులు మంజూరు చేస్తామని, పూర్తి స్థాయిలో నియమ నిబంధనలు, రక్షణ చర్యలు చేపట్టినవారికి మాత్రమే అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు.
దరఖాస్తు చేసుకునే వ్యాపారులు ఆధార్ కార్డు, పదవ తరగతి మెమో, రూ.600 చలాన్‌తో పాటు ఐదు సెట్ల జిరాక్స్ కాపీలను దరఖాస్తుతో జతచేయాలని సూచించారు. అలాగే సంబంధిత ప్రభుత్వ శాఖల నిరభ్యంతర పత్రాలు తప్పనిసరిగా పొందాలని తెలిపారు.
నిర్దేశిత ప్రాంతాల్లోనే విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రజలు నివసించే ప్రాంతాలు లేదా ఇతర దుకాణాల వద్ద చట్ట విరుద్ధంగా బాణసంచా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.


