ములుగు కాంగ్రెస్‌లో మంటలు
చిచ్చురేపిన మునిసిపల్ చైర్మన్ పీఠం
బీసీ మహిళ రిజర్వేషన్‌తో చైర్మన్ రేసులో అంతర్గత పోటీ తీవ్రం
మాజీ సర్పంచ్ బండారు హరినాథం సస్పెన్షన్
సస్పెన్షన్‌తో బయటపడిన విభేదాలు…
మంత్రి సీతక్క హెచ్చరికల తర్వాత వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు
మరిన్ని క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌లో అంతర్గత చర్చ
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో, ఆ పదవిని లక్ష్యంగా చేసుకున్న నాయకులు, వారి కుటుంబాలు, అనుచర గుంపుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వార్డు అభ్యర్థుల ఎంపిక దశ నుంచే చైర్మన్ పీఠంపై రాజకీయ సమీకరణాలు మొదలై, ఎన్నికల వరకు కొనసాగినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థులను ఖరారు చేసే దశలోనే చైర్మన్ రేసులో ఉన్న వర్గాల మధ్య పోటీ తీవ్రతరమైంది. బీసీ మహిళా అభ్యర్థుల పేర్లు తెరపైకి రావడంతో వారి అనుచరులు, ఆర్థికంగా బలమైన వర్గాలు తమ తమ మద్దతు సమీకరణాలను కుదుర్చుకున్నాయి. ఒకే పార్టీలో ఉండి ప్రత్యర్థి వర్గానికి చెందిన అభ్యర్థులు గెలవకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు వినిపించాయి. కొన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ప్రత్యర్థి పార్టీలకు పరోక్షంగా సహకరించారన్న చర్చ పార్టీ అంతర్గతంగా చెలరేగింది.

మంత్రి సీతక్క హెచ్చరికలతో కలకలం
ఎన్నికల ముందు చివరి నిమిషంలో కొన్ని వార్డుల్లో రాజకీయ సమీకరణాలు మారినట్లు సమాచారం. వ్యక్తిగత ఆశలు, చైర్మన్ పదవిపై పోటీ కారణంగా కొందరు నేతలు ప్రత్యర్థి వర్గాలకు మద్దతు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలు ములుగు మున్సిపల్ రాజకీయాల్లో ఉత్కంఠను మరింత పెంచాయి. ఈ అంతర్గత విభేదాలపై ఎన్నికలకంటే ముందే మంత్రి సీతక్కకు సమాచారం చేరినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీ ఐక్యతను కాపాడేందుకు ఆమె ఓపిక పట్టినట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి సీతక్క స్పష్టంగా స్పందిస్తూ, వెన్నుపోటు రాజకీయాలను సహించబోమని హెచ్చరించారు. పార్టీలో ఉండి పార్టీకి నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మాజీ సర్పంచ్ బండారు హరినాథం సస్పెన్షన్
ఈ పరిణామాల నేపథ్యంలో ములుగు పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ బండారు హరినాథంను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన ఎవరినైనా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. పార్టీని దెబ్బతీయడం అంటే కుటుంబాన్ని దెబ్బతీయడమేనని, క్రమశిక్షణ విషయంలో రాజీపడబోమని హెచ్చరించారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా సమీక్ష కొనసాగిస్తోంది. పార్టీకి నష్టం జరిగిన ప్రాంతాలు, ప్రత్యర్థి వర్గాలకు సహకరించిన నేతలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మరికొన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశమున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ములుగు మున్సిపాలిటీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలను బహిర్గతం చేయగా, పార్టీ క్రమశిక్షణను కట్టుదిట్టం చేసే దిశగా నాయకత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.


