గోవిందరావుపేట ఎంపీడీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
కాకతీయ, ములుగు ప్రతినిధి:ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎంపీడీఓ కార్యాలయ భవనంలోని పై అంతస్తులో ఉన్న ఒక గదిలో మంటలు ఎగసిపడటంతో అక్కడి సిబ్బంది, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ఘటన స్థలంలోని ఎంపీడీవో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే పై గదిలో ఉన్న ఫైళ్లు, ఫర్నిచర్ మరియు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధమైనట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగించింది. అయితే, కార్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన రికార్డులు నష్టపోయాయా లేదా అన్న దానిపై అధికారులు పరిశీలన చేపట్టారు. సంఘటనపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారు.


