ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్…
పోలీసుల సత్వర స్పందన
డయల్ 100 ఫిర్యాదుతో క్షణాల్లో ఘటనాస్థలికి పోలీసులు
వర్క్‌షాప్ వద్దే ఫిర్యాదు స్వీకరణ.. అక్కడికక్కడే కేసు నమోదు
బాలానగర్ పోలీస్ స్టేషన్ అధికారుల చర్యలు
కాకతీయ, హైదరాబాద్ : డయల్ 100కు వచ్చిన ఫిర్యాదుపై బాలానగర్ పోలీసులు చూపిన సత్వర స్పందన ప్రజల మన్ననలు అందుకుంటోంది. ఫిర్యాదు అందిన వెంటనే బాధితుడి వద్దకే వెళ్లి, అక్కడికక్కడే కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీ అందజేయడం ద్వారా పోలీసింగ్‌లో కొత్త ప్రమాణాలకు నాంది పలికారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ టి. నర్సింహా రాజు తెలిపిన వివరాల ప్రకారం… బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవి నగర్‌లో ఉన్న ఎలక్ట్రిక్ ప్యానెల్ బోర్డులు తయారు చేసే చిన్న పరిశ్రమలో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు సుమారు రూ.40 వేల విలువైన 14 కాపర్ వైర్ బండిల్లను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు డయల్ 100కు ఫిర్యాదు చేశాడు.
వర్క్‌షాప్ వద్దే ఫిర్యాదు.. ఎఫ్‌ఐఆర్ కాపీ చేతికే
డయల్ 100కు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఆలస్యం చేయకుండా బాధితుడి వర్క్‌షాప్‌కు చేరుకున్నారు. అక్కడికక్కడే రాతపూర్వకంగా ఫిర్యాదు స్వీకరించి, వెంటనే పోలీస్ స్టేషన్‌కు పంపించారు. చట్టప్రకారం కేసు నమోదు చేసిన అనంతరం, మళ్లీ బాధితుడి వర్క్‌షాప్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ ఒరిజినల్ కాపీని బాధితుడి చేతికి అందజేశారు. ఈ విధానం ద్వారా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, బాధితుడికి తక్షణ న్యాయపరమైన భరోసా లభించింది. బాలానగర్ పోలీసుల స్పందనపై బాధితుడు సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇలాంటి విధానం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని, పోలీస్ వ్యవస్థపై విశ్వాసం మరింత పెరుగుతుందని అన్నారు. నేరం జరిగిన వెంటనే బాధితులకు ఇబ్బందులు కలగకుండా, వారి వద్దకే వెళ్లి ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీ అందజేయడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ నర్సింహా రాజు తెలిపారు. బాధితుల హక్కులు, గౌరవాన్ని కాపాడుతూ ప్రజలకు వేగవంతమైన, వృత్తిపరమైన సేవలు అందించడమే సైబరాబాద్ పోలీసుల ఉద్దేశం అని స్పష్టం చేశారు.


