కాకతీయ, తెలంగాణ బ్యూరో: మోహన్ బాబు యూనివర్సిటీపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC) రూ.15 లక్షల జరిమానా విధించడంతో పాటు, 2022 నుండి 2024 సెప్టెంబర్ వరకు విద్యార్థుల నుంచి రూ. 26.17 కోట్ల అదనపు ఫీజులు వసూలు చేసినట్లు గుర్తించింది. ఈ చర్యకు ప్రతిస్పందనగా.. యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు స్పందించారు. అతను ఈ నిర్ణయాన్ని ‘దుష్ప్రచారం’గా పేర్కొంటూ, హైకోర్టు ఇప్పటికే APHERMC సిఫార్సులకు వ్యతిరేకంగా ‘స్టే’ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.
ఈ అంశంపై మరింత విచారణ జరుగుతుందని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ గతంలో అనేక విద్యార్థులకు ఉచిత విద్య, స్కాలర్‌షిప్‌లు అందించినట్లు, అలాగే అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా విద్యా నాణ్యతను మెరుగుపరచడంలో కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఉద్దేశపూర్వకంగా మీడియాలో ప్రసారం చేస్తున్న నిరాధార వార్తలు నమ్మకూడదని తెలిపారు.
విష్ణు మాట్లాడుతూ..విశ్వవిద్యాలయ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉద్దేశపూర్వంగా ఎంపిక చేసిన సమాచారాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మకూడదని తల్లిదండ్రులకు మీడియాకు తెలియజేస్తున్నాము. విచారణ సమయంలో మోహన్ బాబు యూనివర్సిటీ బ్రుందం పూర్తిగా సహకరించిందని అదే కమిషన్ తన నివేదికలో పేర్కొనడం చూస్తే ఎలాంటి తప్పు లేదన్నవిషయం స్పష్టంగా తెలుస్తోంది.
మాకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తున్న వేలాది మంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు హ్రుదయపూర్వక ధన్యవాదాలు. మా ఛాన్సలర్ డాక్టర్ ఎం మోహన్ బాబు దర్శకత్వంలో మేము ప్రపంచస్థాయి సమగ్ర విద్యను అందిస్తూ యువతను శక్తిమంతం చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తామని మంచు విష్ణు తెలిపారు.


