మహిళా సంఘాల రుణాలతో ఆర్థిక భరోసా
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర
కాకతీయ, ములుగు ప్రతినిధి: ప్రభుత్వం అందించే వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని, ఆ రుణాలను సద్వినియోగించుకొని మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణితో కలిసి ములుగు నియోజకవర్గానికి చెందిన 9 మండలాల స్వయం సహాయక సంఘాలకు రెండు కోట్ల 26 లక్షల 76 వేల వడ్డీలేని రుణాల చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసంక్షేమ పథకాలను ప్రారంభించి వైభవంగా అమలు చేస్తుందన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఒక గ్రూపు సభ్యులకు రూ.20 లక్షల రుణాన్ని అందించి వారిని వ్యాపారస్తులుగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం మహిళలపై నమ్మకంతో ఎలాంటి తనఖా లేకుండా వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం చాలా సంతోషకరమని తెలిపారు. మహిళా సంఘాలకు 2025-26 ఖరీఫ్ సీజన్ లో 60 ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించారని, వాటి ద్వారా 21,364 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేవారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ప్రభుత్వం పెట్టుబడి సహాయం ద్వారా జిల్లాలో 1300 మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలను తక్షణమే అందించగా లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించుకున్నారని తెలిపారు. ములుగు జిల్లాలో మొత్తం 3500 ఇందిరమ్మ ఇళ్ల ను మంజూరు చేయగా , 2900 ఇండ్లు నిర్మాణం ప్రారంభమయిందని, 600 గృహాలు స్లాబ్ నిర్మాణం వరకు పూర్తి అయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డిఓ శ్రీనివాస్ రావు, ఎల్డిఎం జయ ప్రకాష్, ఏపీడీ శ్రీనివాస్, జిల్లా, మండల సమాఖ్య, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


