నల్లబెల్లి మండలంలో ఆర్థిక సాక్షరత కార్యక్రమం
కాకతీయ . నల్లబెల్లి: నల్లబెల్లి మండలం మామిండ్ల వీరయ్యపల్లి గ్రామంలో ఆర్థిక సాక్షరత (ఫైనాన్షియల్ లిటరసీ) కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సంపత్ నల్లబెల్లి యూనియన్ బ్యాంక్ మేనేజర్ నరేష్ యూనియన్ బ్యాంక్ మిత్రలు శంకర్, సంధ్య, ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్లు హైమావతి, సాయికుమార్, రమేష్ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడిన బ్యాంక్ మేనేజర్ నరేష్ ప్రతి ఒక్కరూ తమ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి కేవైసీ (KYC) వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని సూచించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందరూ వినియోగించుకోవాలని కోరారు.
ప్రత్యేకంగా సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అపరిచితుల ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులు నమ్మి వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు ఎవరికి చెప్పకూడదని సూచించారు. ఒకవేళ సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని వివరించారు.
గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.


