కొండగట్టు బాధితులకు ఆర్థిక సాయం
రూ.83 లక్షల సీఎం సహాయ నిధి పంపిణీ చేసిన మంత్రి లక్ష్మణ్‌కుమార్
ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని హామీ
కొండగట్టు–ధర్మపురి టెంపుల్ సిటీ కారిడార్ అభివృద్ధిపై స్పష్టీకరణ
కాకతీయ, కరీంనగర్ : మల్యాల మండలం ముత్యంపేటలో ఇటీవల కొండగట్టులో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.83,12,000 విలువైన చెక్కులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… లక్షలాది రూపాయలు అప్పులు చేసి వ్యాపారాలు ప్రారంభించిన దుకాణదారులు అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి విషయం తీసుకెళ్లగా, జిల్లా అధికారుల ద్వారా సమగ్ర నివేదిక సమర్పించడంతో ప్రభుత్వం తక్షణమే స్పందించిందన్నారు. బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధి నుంచి రూ.83.12 లక్షలు మంజూరు చేయడంతో పాటు, విద్యుత్ సంస్థ ద్వారా రూ.29 లక్షలు, డీఆర్‌డీఓ ద్వారా మరో రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.
వ్యాపారాల పునరుద్ధరణకు ప్రభుత్వ భరోసా
అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులు మళ్లీ యథావిధిగా వ్యాపారాలు కొనసాగించేలా ప్రభుత్వం భవిష్యత్తులోనూ పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. అదేవిధంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయం, కొండగట్టు, ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాలను కలుపుతూ టెంపుల్ సిటీ కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కొండగట్టు గిరి ప్రదక్షిణ మార్గం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని మంత్రి వెల్లడించారు.


