కాకతీయ, ములుగు: ములుగు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాను ప్రదర్శించామని, దానిలోని పోలింగ్ కేంద్రాల విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించామని తెలపారు.
అందిన అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాలో మార్పులు చేర్పులు చేసిన తర్వాతే 10న జాబితా ప్రకటిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. మండల స్థాయిలో నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాల్లో కూడా అభ్యంతరాలను స్వీకరించామని, తుది జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, డిప్యూటీ సీఈఓ రాజు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


