ఫీల్డింగే ముంచింది
మిడిల్ ఓవర్లలో ఫీల్డర్ల ఉదాసీనత
చాలా తేలికగా సింగిల్స్ ఇచ్చేశారు
బౌలర్లు సృష్టించిన ఒత్తిడి నీరుగారింది
క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కోల్పోవడంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చివరి వన్డేలో విరాట్ కోహ్లీ(124) అద్భుత సెంచరీతో పోరాడినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో జట్టు వైఫల్యాలపై పోస్టుమార్టం చేసిన సునీల్ గవాస్కర్.. ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ లేదా బౌలింగ్ కాదని.. మన ఫీల్డింగ్ అని కుండబద్ధలు కొట్టారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్‌తో జరిగిన చర్చలో గవాస్కర్ భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను తప్పుపట్టారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ఫీల్డర్లు చూపిన ఉదాసీనత కివీస్ బ్యాటర్లకు వరంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. “నేను పేర్లు చెప్పాలని అనుకోవడం లేదు కానీ, కొంతమంది ఆటగాళ్లు చాలా తేలికగా సింగిల్స్ ఇచ్చేశారు. దీనివల్ల బౌలర్లు సృష్టించిన ఒత్తిడి మొత్తం నీరుగారిపోయింది” అని గవాస్కర్ మండిపడ్డారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు ఫీల్డింగ్‌లో చురుగ్గా ఉన్నప్పటికీ, మిగతా జట్టులో ఆ చురుకుదనం కనిపించలేదని ఆయన విమర్శించారు. సులభంగా స్ట్రైక్ రొటేట్ చేసే అవకాశం ఇవ్వడం వల్ల డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వంటి బ్యాటర్లు ఎలాంటి రిస్క్ తీసుకోకుండానే సెటిల్ అయిపోయారని, ఇది కివీస్ స్కోరు బోర్డు వేగంగా కదలడానికి కారణమైందని విశ్లేషించారు.
యువ ఆటగాళ్లపైనే గురి
రోహిత్, కోహ్లీల ఫిట్‌నెస్‌ను సమర్థించిన గవాస్కర్.. జట్టులోని మిగతా యువ ఆటగాళ్ల నిబద్ధతపై పరోక్షంగా ప్రశ్నలు సంధించారు. ఆధునిక క్రికెట్‌లో ఫీల్డింగ్ అనేది మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే అంశమని, అక్కడ అలసత్వం ప్రదర్శించడం క్షమించరాని నేరమని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని ఈ యువ జట్టు ఫీల్డింగ్ విభాగంలో మరింత కష్టపడాల్సి ఉందని, లేకపోతే రాబోయే సిరీస్‌లలో కూడా ఇలాంటి పరాజయాలు తప్పవని సునీల్ గవాస్కర్ హెచ్చరించారు.


