ఫీజు రీయింబర్స్మెంట్లను విడుదల చేయాలి
విద్యార్థులు మానసిక వేదనలో ఉన్నారు
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్ నాగేశ్వర రావు
కాకతీయ, ఖమ్మం : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జార్జి రెడ్డి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్ నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హైకోర్టు వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. విద్యార్థుల విద్యా భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొని, వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు గడువులు పెడుతూ కాలం గడుపుతున్నాయే తప్ప బకాయిలను విడుదల చేయడం లేదని విమర్శించారు. ఫీజులు ముందుగా విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చని అనుమతించడం పేద విద్యార్థులపై భారం మోపడమేనన్నారు. రాష్ట్రంలో భారీగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దీని వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ గందరగోళంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్యార్థుల హక్కులను పరిరక్షించేలా ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో కె. స్వాతి, మందా సురేష్, బొడ్డుపల్లి రాము, పైండ్ల శ్యామల తదితరులు పాల్గొన్నారు.


