- లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం
- ఎస్ఎఫ్ఐ
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : రూ.8వేల కోట్లకు పైగా విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని విద్యార్థులు, కళాశాలల యజమానులు ఇబ్బందులకు గురవుతున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాంపెల్లి అరవింద్, గజ్జెల శ్రీకాంత్ అన్నారు. గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్మ్సెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే పెండింగ్ బకాయిలు విడుదల చేస్తానని మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చాక మర్చిపోయారన్నారు.
చదువులు పూర్తి చేసుకొని విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలకు వెళ్తే రీయింబర్స్మెంట్ కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కళాశాల యజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నారని వాపోయారు. కళాశాల యాజమాన్యాలు కూడా తమకు అధిక భారం అవుతుందని కళాశాలలు మూసివేసి రోడ్లమీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి గతంలో కనపడిందన్నారు. యాజమాన్యాలు, కళాశాలలపైన విజిలెన్స్ దాడులు సిగ్గుమాలిన చర్య అని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు పైన ఏమాత్రం లేదన్నారు. పాలకులకు విద్యార్థులు తప్పకుండా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా విద్యార్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆసపెల్లి వినయ్ సాగర్, దుర్గం భోగేష్, జిల్లా సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు అంబాల సందేశ్, రాకేష్, రక్షక్, నరేష్, నాయకులు సన్నీ, అంజి, అభి, అజయ్, తదితరులు పాల్గొన్నారు.


