ఓటేసిన ప్రజలకు తప్ప ఎవరికి భయపడ
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
కాకతీయ, గీసుగొండ : తనను ఓటేసి గెలిపించిన ప్రజలకు తప్ప ఎవరికి భయపడేది లేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మండలంలోని వంచనగిరి గ్రామంలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల ముందు పార్టీ నిర్ణయంతో పరకాల అభ్యర్థిగా వచ్చానని, రేవంత్ రెడ్డి మాటకు గౌరవం తెలుపుతూ పోటీకి దిగగా, నియోజకవర్గ ప్రజలు తనను విజయపథంలో నడిపించారని గుర్తుచేశారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.పార్టీ నిర్ణయం మేరకు అందరూ విధేయతగా ఉండాలని, ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కడియం కావ్యను మంచి మెజారిటీతో గెలిపించామని, రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూడా పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలని కోరారు.ఓ పెద్ద నాయకుడు వీడియో కాల్ చూస్తూ స్థానిక మాజీ ఎంపీటీసీ భర్తపై తప్పుడు కేసులు పెట్టించి కొట్టించాడని, కానీ తనను నమ్ముకుని వచ్చిన వారికి అండగా నిలిచానని ఎమ్మెల్యే తెలిపారు. తాను బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే గ్రామ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించి అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


