జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..
14ఏళ్ల బాలికతో పాటు మరో ఇద్దరు మృతి..
గాయపడిన వారికి ఎంజీఎం లో చికిత్స..
క్షతగాత్రులను పరామర్శించిన వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్..
కాకతీయ, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపెళ్లి గ్రామ శివారులో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బొలెరో పెళ్లి వాహనాన్ని వెనుకనుంచి వేగంగా వచ్చిన బోర్‌వెల్ లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 14 ఏళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన పలువురిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సుదన్‌పల్లి గ్రామానికి చెందినవారని గుర్తించారు. పెళ్లి కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఎంజీఎం హాస్పిటల్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రమాదం జరిగిన తీరుపై సంబంధిత అధికారుల నుండి వివరాలు సేకరించారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యసేవలపై ఎంజీఎం వైద్యులను ప్రశ్నించారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.



