కాకతీయ, వరంగల్: కేరళ ప్రభుత్వం తొలిసారిగా కేరళ అర్బన్ కాంక్లేవ్- 2025 పేరుతో నిర్వహిస్తున్న సదస్సులో మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ లో వేగవంతమైన పట్టణీకరణ, సమష్టి స్థిరమైన అభివృద్ధి, సామాజిక పురోగతి కొరకు అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మేయర్ కూలంకషంగా వివరించారు.
ఈ సందర్భం గా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ పై ప్రత్యేక దృష్టి సారించి, వరంగల్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని, అందులో భాగంగా వరంగల్ మాస్టర్ ప్లాన్ ను ఆమోదించారని అన్నారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ యు జి డి ఏర్పాటుకు ఇప్పటికే రూ. 4170 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు.
వరంగల్ లో విమానాశ్రయం ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు తీసుకొంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి సారధ్యంలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, హూజురాబాద్ వద్ద రూ.150 కోట్ల వ్యయంతో 25 ఎకరాల స్థలంలో 6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను నెలకొల్పుటకు చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నయని తెలిపారు.
బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో కూరగాయల వ్యర్ధాలతో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ నగర ప్రాంతాల్లో వరదల నియంత్రణ, భూగర్భజలాల రీఛార్జ్, పర్యావరణ పరిరక్షణకు, పర్యాటకులను ఆకర్షించేలా స్పాంజ్ పార్కుల ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సదస్సులో మంత్రులు, పలు నగరాల మేయర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


