కాకతీయ, ములుగు : ప్రతీ రెండేళ్లకోసారి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరను రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో, గిరిజన పూజారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. 2026 జనవరిలో జరగనున్న జాతర కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. అయితే జాతర ఏర్పాట్ల దృష్ట్యా మేడారం పరిసర గ్రామాలైన ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, రెడ్డిగూడెం, నార్లపూర్, వెంగళాపూర్ ప్రాంతాల రైతులు వందల ఎకరాల పంట భూములను సాగు చేయకుండా బీడుగా ఉంచాల్సి వచ్చింది. దీంతో దాదాపు 2 వేల మంది రైతులు నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాతర అభివృద్ధి పనుల కోసం కోట్ల రూపాయలు కేటాయించినట్లే, పంటలు వేయని రైతులకు కూడా ఎకరాకు 50 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. జాతర ప్రారంభానికి ముందే పరిహారం చెల్లిస్తే రైతులకు మేలు చేసిన వారు అవుతారని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మేడారం, మరో మూడు గ్రామపంచాయితీల రైతులు ఏకమై సమ్మక్క భవన్‌లో సమావేశమై ‘మేడారం జాతర పంట నష్టం పరిహార కమిటీ’ని ఏర్పాటు చేసుకున్నారు.
కమిటీ అధ్యక్షుడిగా మేడారం గ్రామానికి చెందిన ఆలం కృష్ణను ఎన్నుకున్నారు. ఈ కమిటీ ద్వారానే ప్రభుత్వం ముందు తమ డిమాండ్లను ఉంచి, పరిహారం కోసం పోరాడతామని రైతులు స్పష్టం చేశారు. సమావేశం అనంతరం రైతులు వనదేవతలను దర్శించుకుని, పంట నష్ట పరిహారం కోసం వినతిపత్రాన్ని సమర్పించారు.


