రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
కాకతీయ, నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలంలో పాఖాల తూముల గేట్లు ఎత్తి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రబీ సీజన్ పంటల కోసం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువల్లో పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని తొలగించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు. మొత్తం రూ.130 కోట్ల వ్యయంతో కాలువల లైనింగ్ పనులు మరో నాలుగు నెలల్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
రైతన్నల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల పక్షాన ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సాగునీటి వసతులు మెరుగుపడితే పంట దిగుబడులు పెరుగుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.


