రైతులకు ఎలాంటి నష్టం జరగకూడదు
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలి
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
కాకతీయ నెల్లికుదురు : రైతులకు ఎలాంటి నష్టం జరగకూడదని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని కస్తూర్బా గురుకుల పాఠశాల, రామన్నగూడెం గ్రామం ఎక్స్ రోడ్డు వద్ద ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల నిర్వహణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో (255) కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని,
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల రైతులకు ఎలాంటి పంట నష్టం జరగకుండా ముందస్తు సమాచారం అందిస్తూ అన్ని వసతులు కల్పించి రైతులను అప్రమత్తం చేయాలన్నారు,
కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి వెంట వెంటనే తరలించాలని, రైతుల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసి డబ్బులు త్వరగా రావడం కోసం నివేదికలు పంపాలన్నారు,
కేంద్రాలలో గన్ని సంచులు, తార్పాలిన్లు, మ్యాచ్చర్ మిషన్, ప్యాడీ క్లీనర్స్, వేయింగ్ మిషన్స్, అందుబాటులో ఉంచుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ధాన్యం తరలింపు విషయంలో పూర్తి అవగాహన కల్పించాలని ఎఫ్ క్యూ నాన్స్ ప్రకారం ధాన్యాన్ని తీసుకువచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలనీ తద్వారా రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చి లబ్ధి పొందుతారని సూచించారు,
ధాన్యం రవాణా విషయంలో వాహనాలను నిత్యం సిద్దంగా ఉంచుకోవాలని, హమలీలు, అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు,
వ్యవసాయ, సహకార, గిరిజన కార్పొరేషన్, డిఆర్డిఏ, ఐకెపి పౌరసరఫరాలు, తహసీల్దారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ జిల్లా లక్ష్యం విజయవంతంగా నిర్వహించి, కొనుగోలను పూర్తిచేయాలని సూచించారు,అలాగే ప్యాడి,పత్తి, సోయా, తదితర పంటల కొనుగోళ్ల విషయంలో ఇప్పటికే క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించి సిబ్బందికి శిక్షణ తరగతులు ఇవ్వడం జరిగిందని, పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉంటూ కొనుగోలను నిర్వహించాలని ఆదేశించారు.
కేజీబీవీ నీ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టోర్ గది, టాయిలెట్స్, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, పరిసరాలను పరిశీలించారు,
పిల్లలకు హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ సానిటేషన్ లపై అవగాహన కల్పించి సిబ్బంది షెడ్యూల్ ప్రకారం పై కార్యక్రమాలు నిర్వహించాలని, నూతన విద్యా విధానం డిజిటల్ తరగతులు ప్రతి సబ్జెక్టు పై పట్టు సాధించే విధంగా విద్యార్థులకు అవసరమైన విద్య బోధనలు ప్రత్యేక తరగతులు నిర్వహించాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సిహెచ్ నరేష్, ఆర్. ఐ రామకృష్ణ, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



