రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
కాకతీయ, పెద్దవంగర : రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని, అలా చేస్తేనే నష్టాలను నివారించుకోవచ్చని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధరగా 2400 చెల్లిస్తూ రైతులకు తక్షణ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో హక ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ నిరంతరం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రామాభివృద్ధి పనులకు శ్రీకారం
అంతకుముందు చిట్యాల గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి ఈ భవనం కీలకమని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సేవలను సులభంగా అందించేందుకు ఆధునిక సౌకర్యాలతో భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలకు పరిపాలనా సేవలు ఒకేచోట అందుబాటులోకి రావడం వల్ల పారదర్శకత, వేగం పెరుగుతాయని చెప్పారు. గ్రామీణ అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. చిట్యాల గ్రామ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వేణుమాధవ్, పీఆర్ ఏఈ దయాకర్, ఏఓ స్వామి నాయక్, మండల అధ్యక్షులు ముద్దసాని సురేష్, ఉపాధ్యక్షులు రంగు మురళి, నాయకులు తోటకూరి శ్రీనివాస్, గోపాల్ నాయక్, చంద్రశేఖర్ నాయక్, దుంపల శ్యామ్, పంతులు, సతీష్, శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు.


