రైతులపై నిర్లక్ష్యం తగదు
పంట నష్టంపై ప్రభుత్వం మౌనం
బీమా పథకాల అమలులో లోపాలు
మొక్కజొన్నకు మద్దతు ధర అమలు కావడం లేదు
కొనుగోలు కేంద్రాల లేమితో రైతుల ఇబ్బందులు
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి
కాకతీయ, జగిత్యాల్/రాయికల్ : ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నేలపాలైన రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాయికల్ మండల కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోత దశలో ఉన్న మొక్కజొన్న, మామిడి పంటలు నష్టపోయినా ఇప్పటివరకు ప్రభుత్వం పరిహారం ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు. గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని గుర్తుచేశారు. పంటల బీమా పథకం సక్రమంగా అమలైతే రైతులకు కొంత ఉపశమనం లభించేదని, కానీ అమలులో స్పష్టత లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. బీమా కంపెనీల ద్వారా కూడా పరిహారం అందకపోవడం బాధాకరమన్నారు.
మద్దతు ధర కేవలం మాటలేనంటూ విమర్శ
మొక్కజొన్నకు నిర్ణయించిన కనీస మద్దతు ధర రూపాయలు 2400గా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో రైతులకు రూపాయలు 1800 మాత్రమే లభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయికల్ మార్కెట్‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం, ప్రారంభమైన చోట్ల కూడా తూకం ప్రక్రియ ఆలస్యమవడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూపాయలు 20000 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద ఎకరానికి రూపాయలు 6000 మాత్రమే ఇవ్వడం సరిపోదని పేర్కొన్నారు. కమతం పరిమితులు లేకుండా అన్ని ఎకరాలకు సాయం అందించాలని సూచించారు. రైతు బీమా పథకాన్ని కొనసాగించాలని, కొత్తగా ప్రవేశపెడుతున్న కుటుంబ బీమా పథకం రైతులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడదని అభిప్రాయపడ్డారు. పంటలు పూర్తి దిగుబడి ఇవ్వాలంటే ఏప్రిల్ 15 వరకు ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని జీవన్ రెడ్డి హెచ్చరించారు.


