- మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ బాబు
కాకతీయ, గీసుగొండ : రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, లేబుల్ లేని విత్తనాలను కొనరాదని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే తమకు తెలియజేయాలని మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ బాబు సూచించారు. మండలంలోని రైతులు అనుమతిలేని మేల్–ఫీమేల్ విత్తన ఆర్గనైజర్ల నుండి అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు హెచ్చరించారు. ఇటీవల కొందరు మేల్–ఫీమేల్ మొక్కజొన్న విత్తనాలు, వరి ఆర్గనైజర్ల పేరుతో గ్రామాల్లో తిరుగుతున్నారు. రైతులకు విత్తనాలు అమ్మడానికి, హైబ్రిడ్ విత్తన ఉత్పత్తి పేరుతో రిజిస్ట్రేషన్ లేదా డబ్బులు వసూలు చేయడం జరుగుతోందని తెలిపారు. మేల్–ఫీమేల్ విత్తనాలు సాధారణ రైతు సాగు కోసం కావని, ఇవి విత్తన ఉత్పత్తి కంపెనీలు మాత్రమే ఉపయోగించే లైన్లు అని అధికారులు స్పష్టం చేశారు. విత్తనాలు కొనుగోలు చేసే ముందు పూర్తి వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే సీడ్స్ యాక్ట్, 1966 ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.5వేల జరిమానా లేదా రెండూ విధించవచ్చని అధికారులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు విత్తనాలు విక్రయిస్తే సమీప వ్యవసాయ కార్యాలయం లేదా పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.


