- బండి సంజయ్‌ను కోరిన మంత్రి ప్రభాకర్
- వరద ప్రభావిత ప్రాంతాల్లో పొన్నం పర్యటన
- బస్వాపూర్, పోరెడ్డిపల్లి, అక్కెనపల్లి ప్రాంతాల్లో పంటల పరిశీలన
కాకతీయ, కరీంనగర్ : హుస్నాబాద్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం పర్యటించారు. వరద ఉధృతికి తెగిపోయిన రోడ్లు, కొట్టుకుపోయిన కల్వర్టులు, దెబ్బతిన్న పంటలను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. కోహెడ మండలంలోని బస్వాపూర్, పోరెడ్డిపల్లి, అక్కెనపల్లి గ్రామాల్లో మోయతుమ్మెద వాగు ఉధృతికి తెగిపోయిన బ్రిడ్జీలు, ముంపు ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. అధికారులు రోడ్లు, కల్వర్టులు, పంటల నష్టాన్ని పూర్తి స్థాయిలో రికార్డు చేయాలని ఆదేశించారు.
హుస్నాబాద్ మొత్తం జలమయం
హుస్నాబాద్ నియోజకవర్గం కరీంనగర్, సిద్ధిపేట, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉంది. మొత్తం ప్రాంతం జలమయమై వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు పాడైపోయాయి. మూడు ప్రాణ నష్టాలు సంభవించాయని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారని తెలిపారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని, రాజకీయాలకు అతీతంగా రైతుల పక్షాన అందరూ నిలవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రైతులను ఆదుకోవాలని కోరుతున్నానన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతాంగానికి అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.


