కాకతీయ, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. శుక్రవారం తాడ్వాయి మండలంలోని ఊరట్టం, కన్నెపల్లి, నార్లపూర్ గ్రామాల్లో పంట పొలాలను సందర్శించిన ఆమె రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ వందలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు యా భైవేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. వర్షాల వల్ల ఇసుక మేటలు పోసుకున్న భూముల సమస్యను ప్రభుత్వం స్వయంగా పరిష్కరించి ఇసుక మేటలను తొలగించాలని, లేదంటే లక్ష రూపాయల పరిహారం అందించాలని ఆమె కోరారు.
తూముల వాగు, జంపన్న వాగు ఇరువైపులా చిలుకలగుట్ట వరకు కరకట్ట నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మాజీ జడ్పిటిసి గ్రామ సహాయం శ్రీనివాసరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పోగు నాగేష్, మాజీ సర్పంచులు చిడం బాబురావు, గొంది శ్రీధర్, సిద్ధబోయిన చిన్నక్క, శివరాజ్, ఎటునాగారం మాజీ సర్పంచ్ ఈసం రామ్మూర్తి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడే జాడి బాబురావు, తదితరులు పాల్గొన్నారు.


