22 నుంచి రైతుభరోసా..
70 లక్షల మంది ఖాతాల్లోకి రూ.3,590 కోట్ల నగదు బదిలీ
ఇప్పటికే అన్నదాతల అకౌంట్లోకి రూ. 18 వేల కోట్లు
ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులు జమ
అన్నదాతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుడ్ న్యూస్
రైతును రాజు చేయడమే లక్ష్యమని పునరుద్ఘాటన
రవీంద్రభారతిలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు
ముఖ్య అతిథిగా హాజరైన సీఎం .. మంత్రులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: రైతులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి ‘రైతు భరోసా’పై రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా కింద అందించే పెట్టుబడి సాయాన్ని ఈ నెల 22వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. రైతు భరోసా కింద మూడు విడతల్లో మొత్తం రూ.9వేల కోట్ల నగదు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో భాష, సంస్కృతి, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన పంచాంగం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్నదాతలు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటి చేస్తామని పునరుద్ఘాటించారు. కర్షకులు ఆత్మగౌరవంతో బతికేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందన్న ఆయన రైతు భరోసా ద్వారా ఇప్పటికే 18 వేల కోట్లను ఇచ్చామన్నారు. ఈనెల 22 నుంచి రైతుభరోసా కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.

ఈనెల 22 నుంచి రైతుభరోసా
సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో తెలంగాణ ప్రతిష్ఠను పెంచుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి రైతుల సమస్యలను పరిష్కారించామని వెల్లడించారు. ఫలితంగా ఈనాడు రైతులు సంతోషంగా తమ యాజమాన్య హక్కులను పొందుతున్నారని తెలిపారు. సాదాబైనామాలకు కూడా త్వరలోనే పరిష్కారం చూపిస్తామన్నారు. ఉగాది అనేది రైతుల పండుగని అభివర్ణించారు. కర్షకుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషిచేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్రమంతులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి, పొన్నం, కొండా సురేఖలు పాల్గొన్నారు. ఉగాది వేడుకల సందర్భంగా మధ్యాహ్నం మూడు గంటలకు రవీంద్రభారతిలో కవి సమ్మేళనం ఉంది.
మూడు విడతలు.. రూ.9,000 కోట్లు
రైతు భరోసా నిధుల బదిలీని ప్రభుత్వం మూడు విడతలుగా చేయనుంది. తొలి విడతగా ఈనెల 22 నుంచి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకిరూ.3,590 కోట్ల నగదు బదిలీ చేయనున్నారు. మొదటి రోజు ఒక ఎకరం భూ విస్తీర్ణం ఉన్న రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులు జమ చేస్తారు. అనంతరం మూడు వారాల తర్వాత రెండో విడతలో రూ.2,650 కోట్లు జమ చేయనుంది. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా మిగిలిన రూ.2,760 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. కాగా, రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రైతుల తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలియజేశారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న ప్రభుత్వమని మరోసారి రుజువైందని తుమ్మల పేర్కొన్నారు.


