కాకతీయ, తెలంగాణ బ్యూరో : రైతులకు ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నిన్న ఒక్క రోజులోనే రాష్ట్రానికి 9వేల మెట్రిక్ టన్నుల యూరియా చేరగా, మంగళవారం మరో 5వేల మెట్రిక్ టన్నులు చేరనున్నట్లు వెల్లడించారు.
ఈ యూరియా సనత్‌నగర్, వరంగల్, జడ్చర్ల, నాగిరెడ్డిపల్లి, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్ రైల్వే రేక్ పాయింట్లకు పంపిణీ అవుతుందని చెప్పారు. మరో వారం రోజుల్లో కరాయికల్, గంగవరం, దామ్ర పోర్టుల ద్వారా 27,470 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని మంత్రి వివరించారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా, డిమాండ్‌కు అనుగుణంగా సమయానికి సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైన చోట ఎరువులు తక్షణమే అందేలా సమన్వయం చేయాలని కూడా ఆదేశించారు.
ఇటీవల వర్షాల కారణంగా జరిగిన పంటనష్టంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి చెప్పారు. రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా, సకాలంలో సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం 5 రోజుల్లోపే పంటనష్టం సర్వే పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రైతుల సంక్షేమం, వారి పంటల రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు.


