ఆయిల్‌ఫామ్ సాగుపై రైతుల క్షేత్ర ప్రదర్శన
కాకతీయ, నల్లబెల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో సంబంధిత శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలోని నర్మేట మండలం నర్మేట గ్రామంలో ఆయిల్‌ఫామ్ సాగుపై క్షేత్ర ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయిల్‌ఫామ్ తోటలతో పాటు పామాయిల్ గింజల నుంచి ఇంధనం తీసే కర్మాగారం, 150 ప్రదర్శన స్టాల్స్‌ను రైతులు సందర్శించారు. ఆయిల్‌ఫామ్ సాగు ద్వారా రైతులకు ఆర్థిక స్వావలంబనతో పాటు సాగు శ్రమ తగ్గింపు వంటి అంశాలపై అధికారులు వివరించారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో నల్లబెల్లి మండలం నుంచి రైతులకు బస్సు సౌకర్యం కల్పించారు. శనివారం నల్లబెల్లి మండల కేంద్రంతో పాటు కొండాయలపల్లి, శనిగరం, ముచింపుల, రేలకుంట, నందిగామ, మేడపల్లి, రామతీర్థం గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతులు ఈ క్షేత్ర ప్రదర్శనకు బయలుదేరారు. వారి వెంట ఏవోరజిత వ్యవసాయ విస్తరణ అధికారి మహేందర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఇన్‌చార్జి సీఈవో ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆదివారం నిర్వహించనున్న ప్రదర్శనకు ఐదు బస్సుల్లో నల్లబెల్లి, నారక్కపేట, మేడేపల్లి, గోవిందపూర్, ముచింపుల క్లస్టర్లకు చెందిన సుమారు 250 మంది రైతులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.


