కాకతీయ, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామ పరిసరాల్లో క్వారీల్లో జరుగుతున్న బాంబ్ బ్లాస్టింగ్‌పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి రాస్తారోకోకు దిగారు. ఈ సందర్బంగా రైతులు మాట్లడుతూ.. క్వారీల్లో నిరంతరంగా జరుగుతున్న పేలుళ్ల కారణంగా భూమి కంపిస్తున్నట్లు అనిపిస్తోందని, పంటలు తీవ్ర నష్టానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భూకంపాల్లా దద్దరిల్లుతున్న శబ్దాలు, గాలిలో వ్యాపిస్తున్న దుమ్ము వల్ల పంటలు ఎండిపోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. రోజూ బాంబులు పేలుతూనే ఉన్నాయని, పొలాల్లో పంటలు నిలబడలేని స్థితి నెలకొందని ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎలా బతకాలి..? అని రైతులు ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు సమస్యను తెలియజేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై రైతులు తీవ్రంగా మండిపడ్డారు.
పరిష్కారం లేకపోవడంతో రోడ్డుపైకి వచ్చామని, ఇక పై తమ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టక తప్పదని హెచ్చరించారు. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా పంటలు నాశనం అయ్యాయని, రైతులకు తక్షణమే పరిహారం చెల్లించడంతో పాటు బాంబ్ బ్లాస్టింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యపై అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.


