గిట్టుబాటు ధరతోనే రైతులకు మేలు..
కాకతీయ, రాయపర్తి: రైతులు కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర అందినప్పుడే రైతులకు మేలు జరుగుతుందని వర్ధన్నపేట ఏఎంసీ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు గన్నారం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు పెట్టుబడి పెట్టి,ఆరుగాలం కష్టపడి అప్పుల పాలు కాకుండా సరైన గిట్టుబాటు ధర అందించి ఆదుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి శ్రమకు తగ్గ లాభం పొందాలని ఆయన సూచించారు. రైతు ఆనందంగా ఉన్నప్పుడే రాష్ట్రంతో పాటు దేశం బాగుపడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని కొనియాడారు.ప్రతి రైతు మధ్యవర్తులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని కృష్ణారెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం రవీందర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యా నాయక్,టీపీసీసీ మాజీ సెక్రెటరీ బిల్లా సుధీర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మచ్చ రమేష్,పాల్వంచ కోటేశ్వర్,వనజారాణి,ఎండి ఉస్మాన్, గోవర్ధన్ రెడ్డి,సీఏలు పుష్ప, శ్రీలత,రైతులు పాల్గొన్నారు.


