కాకతీయ, వర్ధన్నపేట: వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి మండలం ఏడీ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఉట్టి తండాకు చెందిన భూక్యా బాలు నాయక్ రైతు తనకు ఉన్న భూమిలో పత్తి పంట సాగు చేస్తున్నాడు. నెల రోజులుగా యూరియా కోసం వ్యవసాయ సహకార సంఘాల చుట్టూ తిరిగినా కానీ ఎరువు దొరకపోవడంతో విసుగు చెంది మనోవేదనతో పత్తి పంటను పీకేశాడు.
ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేరుగా రైతు పొలం వద్దకే వెళ్లి బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడారు. పంటల దీనస్థితిని చూస్తుంటే ఈ సమయంలో రైతులకు యూరియా ఎంత అవసరమో అర్థమవుతుందని, కానీ రైతులకు సరైన సమయంలో యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
నాడు కెసిఆర్ హయాంలో 6 నెలల ముందే ఎరువులు నిలువ చేసి రైతులకు ఎరువుల కొరత లేకుండా చేశామని, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపులేక రైతులను ఆగం చేస్తుందన్నారు. ప్రజాపాలన అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను రాక్షసులుగా వేధిస్తుందని, కెసిఆర్ హయాంలో రాజులుగా బ్రతికిన రైతులు ఈ రోజు యూరియా దొరకక తన పంటపొలాన్ని నాశనం చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు.
ఈ దుర్మార్గపు ప్రభుత్వం అన్నింట్లో ముందు చూపు లేక బంగారు తెలంగాణను కనీసం బతుకుదెరువు కూడా లేకుండా చేస్తుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సాగునీరు అందక, యూరియా కొరతతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 20 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.


