కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామంలో బుధవారం ఉదయం అడవి పందుల దాడిలో రైతు దుర్మరణం చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నెలకొల్పింది. స్థానిక రైతు కుందురు వెంకటేశ్వర రెడ్డి (65) తమ పొలానికి వెళ్లి పంటను పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా అడవి పందుల గుంపు దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ప్రతీ ఉదయం లాగానే వెంకటేశ్వర రెడ్డి తమ పొలానికి వెళ్లి పంట పరిస్థితిని పరిశీలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దాడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్థులు తెలిపారు. సంఘటన స్థలానికి గ్రామస్తులు చేరుకుని పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఇటీవల కాలంలో పంట పొలాల్లో పందులు విచ్చలవిడిగా తిరుగుతూ రైతుల ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణమవుతున్నాయి. ప్రభుత్వం ఈ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.


