రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
హిట్ అండ్ రన్ కేసు నమోదు
కాకతీయ, కరీంనగర్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఓ రైతు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. నల్లగుంటపల్లి గ్రామానికి చెందిన వేల్పుల ఐలయ్య (65) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మార్చి 20న తెల్లవారుజామున కరీంనగర్ మార్కెట్‌లో తాను పండించిన కూరగాయలు విక్రయించి, టీవీఎస్ ఎక్సెల్‌పై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో దురిచేడు గ్రామ బస్టాండ్ సమీపంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఐలయ్య తీవ్ర గాయాలపాలై రోడ్డుపై పడిపోయాడు. విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లి యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఐలయ్యకు మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు వెల్లడించారు. పరిస్థితి విషమించడంతో తిరిగి కరీంనగర్‌లోని ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి తరలించగా, మార్చి 23 ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతుడికి భార్య ఉన్నప్పటికీ సంతానం లేదని తెలిసింది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ ఘటనకు కారణమైన గుర్తుతెలియని వాహనం, డ్రైవర్‌ను గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.


