ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే
ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థులు
కాకతీయ, కూసుమంచి: మండల కేంద్రంలోని ప్రగతి విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా ఫేర్వెల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు తమ సీనియర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పదవ తరగతి విద్యార్థులకు స్మరణీయమైన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కొక్కిరేణి సీతారాములు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని కష్టపడి చదవాలని సూచించారు. విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలు కూడా అవసరమని తెలిపారు. ప్రముఖుల ప్రేరణాత్మక ఉపన్యాసాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఆటలు, పాటలు, నృత్యాలతో అందరిని అలరించారు. తమతో కలిసి ఎన్నో సంవత్సరాలు చదివిన పదవ తరగతి విద్యార్థులకు తొమ్మిదో తరగతి విద్యార్థులు భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. పాఠశాలలో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కొందరు విద్యార్థులు మాట్లాడారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. చివరగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఫోటోలు దిగుతూ కార్యక్రమాన్ని ఆనందంగా ముగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కొక్కిరేణి సీతారాములు మానస, ఉపాధ్యాయులు నాగార్జున, ఉదయ్, రాజశేఖర్, రజియా, రంగమణి, నాగలక్ష్మి, భార్గవ్, ఆదిలక్ష్మి, జ్యోతి, స్వాతి, స్నేహ, అనిత, వనితతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.


