కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఆటగాళ్లకు అభిమానులు కొదవలేరు. కానీ ఒక అభిమాని తన అభిమానాన్ని చూపించిన విధానం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ ప్రముఖ ఫుట్‌బాల్ స్టార్ పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఒక అభిమాని తన యావద్ఆస్తిని రాసిచ్చాడు.
ఆ ఆస్తి విలువ సుమారు రూ. 10 వేల కోట్లు. సాధారణంగా అభిమానులు తమ ప్రియమైన ఆటగాళ్లకు జెర్సీలు, బహుమతులు లేదా విలువైన వస్తువులు ఇస్తారు. కానీ ఈ అభిమాని మాత్రం మరీ వింత నిర్ణయం తీసుకున్నాడు. తన వాసియత్ పత్రంలో తన మొత్తం ఆస్తిని ఆ ఫుట్‌బాల్ ఆటగాడికి బదలాయించేలా రాసిచ్చాడు. ఇందులో ప్రాపర్టీలు, బ్యాంక్ బ్యాలెన్స్, షేర్లు, పెట్టుబడులు అన్ని ఉన్నాయి.
అయితే ఆ అభిమానికి కుటుంబసభ్యులు లేరని, అతడు ఒంటరిగా జీవిస్తున్నాడని తెలుస్తోంది. తన జీవితంలో అత్యంత ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఆ ఫుట్‌బాల్ స్టార్ కావడంతో, తన సంపద మొత్తం అతనికే దక్కాలని భావించాడు. “అతడే నా హీరో, నా జీవితానికి అర్థం ఇచ్చిన వ్యక్తి. నా ఆస్తిని పొందటానికి అతనికంటే అర్హుడు ఎవరూ లేరు” అని వాసియత్ పత్రంలో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ విషయం తెలియగానే.. ఆ ఫుట్‌బాల్ స్టార్ నెయ్ మార్ కూడా షాక్ అయ్యాడట. అభిమానుల ప్రేమ తనను ఎప్పుడూ కదిలిస్తుందని, కానీ ఇంతటి పెద్ద నిర్ణయం ఎప్పుడూ ఊహించలేదని అతను వ్యాఖ్యానించాడు. “నేను ఒక ఆటగాడిని మాత్రమే, కానీ అభిమానులు ఇంతటి ప్రేమ చూపించడం నిజంగా నన్ను వినయంగా మారుస్తోంది అని ఆయన తెలిపాడు.
33 ఏళ్ల నెయ్ మర్ నికర విలువ ప్రస్తుతం 300 నుంచి 330 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు చట్టపరంగా బిలియనీర్ ఆస్తి దక్కినట్లయితే ప్రపంచంలోనే అత్యంత సంపన్న అథ్లెట్లలో ఒకడిగా నెయ్ మార్ నిలుస్తారు.


