తనపై అక్కసు వెల్లగక్కుతున్న కొన్ని మీడియా సంస్థలు
మంథనికి ఏమీ చేయని దద్దమ్మ శ్రీధర్ బాబు
మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మంథనికి ఏమీ చేయని దద్దమ్మ శ్రీధర్ బాబు అని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మండిపడ్డారు. అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు శ్రీధర్‌బాబు కొన్ని మీడియా సంస్థలతో తనపై బురద జల్లే దుర్మార్గ ప్రయత్నాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీధర్ బాబు తండ్రి నక్సలైట్ల పేర జనాలను చంపిస్తే.. శ్రీధర్ బాబు పోలీసులను వాడుకుని మా కార్యకర్తలను వేధిస్తున్నాడని అన్నారు. మంథని నియోజకవర్గంలో కొన్ని మీడియా సంస్థలు ప్రత్యేక పరిస్థితులు సృష్టిస్తున్నాయని, మంత్రి శ్రీధర్ బాబు ప్రోద్భలంతో తనకు వ్యతిరేకంగా అసత్య కథనాలు ప్రచురిస్తూ గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. తాను కనబడటం లేదని, ప్రజలకు మొహం చాటేస్తున్నానని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని అన్నారు. నలభై ఏళ్లుగా మంథనిని ఏలుతున్న శ్రీధర్ బాబు కుటుంబం నియోజకవర్గానికి ఓ పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయిందని విమర్శించారు. మంథనిలో తాను మహనీయుల విగ్రహాలు పెడితే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వామనరావు దంపతుల హత్య కేసు విచారణ హైకోర్టు పర్యవేక్షణలోనే జరిగిందని గుర్తుచేశారు. ఎవ్వరు ఎన్ని రకాలుగా తనమీద దుష్ప్రచారం చేసినా ప్రజల కోసం పనిచేయడం మానేది లేదని అన్నారు.


