కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకే తప్పుడు ఆరోపణలు
గ్రామ అభివృద్ధిలో బీఆర్ఎస్ ఘోర వైఫల్యం
ఆశతో వస్తున్నారు తప్ప ఆశయంతో కాదు
: హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల
కాకతీయ, ఆత్మకూరు : బీఆర్ఎస్ అభ్యర్థులు ఆశతో ఎన్నికల్లోకి వస్తున్నారు తప్ప ఆశయంతో రావడం లేదని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కాకతీయ అర్బన్ కోఆపరేటివ్ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి విమర్శించారు. సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి పర్వతగిరి మహేశ్వరి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఆత్మకూరు మండల కేంద్రానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తామని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తప్పుడు ఆరోపణలు చేసే ముందు తాను చేసిన తప్పులు, ప్రజలకు చేసిన మోసాలను గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
మహిళల సమక్షంలో ఆత్మకూరు గ్రామ ప్రజలను అవమానించేలా సిగ్గు, శరం అంటూ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహిళలను గౌరవించకుండా మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పక తప్పదని అన్నారు.
మండల కేంద్రానికి ప్రభుత్వ నిధులతో పాటు అదనపు నిధులు కూడా తీసుకొచ్చి ఆదర్శంగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ఆత్మకూరు ప్రజలకు భరోసా ఇచ్చారు. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించే కాంగ్రెస్ అభ్యర్థి పర్వతగిరి మహేశ్వరిని గెలిపించాలని కోరారు. అవసరమైనప్పుడు కుటుంబ సభ్యునిగా కష్టసుఖాల్లో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసాద్, మాజీ ఆత్మకూరు పీఏసీఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్, కిసాన్ సెల్ అధ్యక్షుడు రేవూరి జైపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ నాగెల్లి సామెల్, కాంగ్రెస్ నాయకులు కోలా రమేష్, రాంపాల్, తిరుపతి, శ్యామ్, బయ్యా కుమార్, బీసీ జిల్లా కన్వీనర్ చిమ్మని దేవరాజ్, ఆత్మకూరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తనుగుల సందీప్, యూత్ నాయకులు రాజ్ కుమార్, నాగెల్లి కిరణ్ ప్రేమకర్ తదితరులు పాల్గొన్నారు.


